Saturday, January 08, 2011

కొండను తొవ్వి.....

చరిత్రలో దేశాన్ని కుదిపేసిన సమస్యల పరిష్కారానికి కమిటీలు ఎన్నోవచ్చాయి. ఈ కమిటీల సిఫార్సులు పుస్తకాలకే పరిమితం అయ్యాయి తప్ప ఒక్కటీ ఆచరణకు నోచుకోలేదు. ఈ ప్రహసనాలు చూసాక కమిటీలంటేనే సామాన్యునికి నమ్మకం పోయింది. తెలంగాణ పరిష్కారానికి ఇలాంటి కమిటీ ఒకటి వేస్తారని తెలిసినప్పుడు మరో కాలయాపన కమిటీ అని అందరు అనుకున్నారు. నిజాన్ని నిగ్గుతేలుస్తారని పెరున్న జస్టిస్ శ్రీకృష్ణ ఈ కమిటీకి నాయకత్వం వహిస్తున్నారని తెలిసాక చిన్న ఆశ చిగురించింది. బొంబాయి అల్లర్లపై వేసిన కమిటీకి సారధ్యం వహించి నిఖ్ఖచ్చి నివేదికతో అన్ని వర్గాల ప్రశంసలు పొందాడు. అంతటి తెగువ, సామర్ధ్యం వున్న జస్టిస్ శ్రీకృష్ణ తెలంగాణ సమస్యకు ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతారని కమిటీకి జనమంతా తమ గోస చెప్పుకున్నారు. SKC పది నెలలుగా రాష్ట్రమంతా తిరుగుతూ వివిధ వర్గాల అభిప్రాయాలను తెలుసుకుంటూ 600 చిల్లర పేజిల నివేదిక సమర్పించింది. ఎళాంటి సూచనలు చేసారో అని ఆత్రుతగా చదివిన వాళ్ళను నివేదిక నిరుత్సాహపరిచింది. పరిష్కారం కోసం ఎన్నుకున్న ప్రమాణాలు, వాళ్ళు చేసిన మొత్తం పరిశోధననే నవ్వులపాలు చెసేవిగా వున్నాయి. నిష్పక్షపాత పరిశోధనచేస్తారన్న పేరు సంపాదించుకున్న శ్రీకృష్ణకు, తెలంగాణ నివేదిక మచ్చతెచ్చింది. అందరికి న్యాయం జరగాలన్న బుద్ధుడి నీతిసూత్రాలతో మొదలైన రిపోర్టు చివరి పేజి కోచ్చెసరికి చదవడమే బుద్ధిలేని పనిగా తోచింది.

తిట్టను పోరా.. గాడిద కొడకా !! అన్నట్టు, నివేదికలో ఒకచోట సమర్ధించిన అంశాన్ని మరోచోట కొట్టిపారేస్తూ, మతిలేని ఈ పరిశోధనలో పసలేదని మొదటి అధ్యాయం లోనే తేలిపోయింది. పెద్దమనుషుల ఒప్పందం సరిగ్గా అమలు చేయకపోవడమే ప్రస్తుత తెలంగాణ ఉద్యమానికి మూల కారణమని ఓ పక్క చెప్తూనే, మరో వైపు రాజకీయ పక్షాలే లేని తెలంగాణ సెంటిమెంటును ఎగదోసారని చెప్పారు. తెలంగాణ వాదానికి కొట్టిపారేయలేని కారణాలున్నాయంటూనే, మూడు ప్రాంతాల మద్య అభివృద్ధిలో తేడాలు లేవని తీర్మానించింది. ఓవైపు 50 ఏళ్ళ తెలంగాణ ఉద్యమ చరిత్రను ఊటంకిస్తూనే, మరో వైపు TRS గెలుపు ఓటములే ఉద్యమానికి ప్రామాణికమని చెప్పింది. ఓ దిక్కు సెంటిమెంటు బలంగా ఉందంటూనె. మరొ దిక్కు సంవత్సర కాలంగా ఉద్యమంలో అమరులైన 400 మంది విద్యార్థుల ఊసే మరిచిపోయింది. చరిత్ర తెలిసిన ఏ వ్యక్తికైనా చిర్రెత్తించే వాదనలివి.

రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వాలన్ని తెలంగాణను నిర్లక్షం చేసాయని మొత్తుకుంటుంటే, ప్రభుత్వం సమర్పించిన అసంపూర్ణ లెక్కలతో అభివృద్ధి అన్ని ప్రాంతాలలో ఒకేలా ఉందని కమిటీ కళ్ళకు గంతలు కట్టుకుంది. 1970 తరువాత 20 సంవత్సరాలు రాష్ట్రంలో వివిధ రంగాలకు ప్రాంతాల వారిగా జరిగిన బడ్జెట్ కేటాఇంపుల రికార్డులు లేవని స్వయంగా ప్రభుత్వమే ప్రకటించింది. ఏ ప్రాంతానికి ఎంత కేటాఇంచారో చెప్పకుండా "అంతా బాగానే వుంది" అని విశయం దాటవేసారు. పర్సంటేజిల గ్రాఫులతో అసలు అంకెలు దాచి తెలంగాణాలోనే ఎక్కువ అభివృద్ధి జరిగిందని చెప్పె తొండి కూతలకు నివేదికలో కొదువలేదు. 25 ఏళ్ళ కింద ఒచ్చిన 610 G.O. గత సంవత్సర కాలంగా బాగానే అమలు జరుగుతుందని, 5 దశాబ్దాలుగా తన్నుకు పోయిన ఉద్యొగాలు అంతంత మాత్రమేనని మసిపూసే ప్రయత్నం చేసింది.

దశాబ్దాలుగా సాగతీస్తున్న మరో సమస్య సాగునీరు. ఉన్న నదులను, ప్రాజెక్టులను ఉదహరిస్తూనే ఎత్తున వున్న తెలంగాణ నుండి పల్లానికి ఉన్న ఆంధ్ర ప్రాంతానికి నీరు పోతుందని, దానికి ఏ ప్రభుత్వాలు ఎమీ చెయ్యలేవని రిపొర్టు చేతులెత్తేసింది. తెలంగాణకు సాగునీరివ్వడం సాధ్యం కానప్పుడు కృష్ణా, గోదావరిలో వాటాలెయ్యడం మోసం కాదా? ప్రత్యేక తెలంగాణ లో ఎత్తిపోతలతోనైనా సరే, ఈప్రాంత వాటా నీటిని ఇక్కడే ఉపయోగించుకునే అంశాన్ని కనీసం పరిగణనలొకి కూడా తీసుకోలేదు. ఎప్పుడో మోదలైన శ్రీశైలం ఎడమగట్టు కాలువ పనులు ఇంకా కొనసాగడానికి ప్రతికూల పరిస్థితులే కారనమని తేల్చి చెప్పింది. 25 ఏళ్ళుగ 40 కిలో మీటర్ల సొరంగం తొవ్వలేని సాంకేతిక కారణాలు చెప్పడంలో చూపిన ఆసక్తి, దాని వెనుకున్న రాజకీయాలు చెప్పడం మరిచింది.

తెలంగాణ ఉద్యమంలో మరో కీలకాంశం ఆత్మగౌరవం & సంస్కృతీ వ్యత్యాసం. కమిటీ విచారణలో ఎంతోమంది ఈ విశయం విన్నవించినా, నివేదికలో ఈ విషయానికి స్థానమే దక్కలేదు. మా భాషను ఎగతాలి చేస్తున్నారని, మా సాంప్రదాయాన్ని విస్మరిస్తున్నారని అరుస్తున్నా, "మంచిది. మాకు కనిపించడం లేదు" అంటూ అలాంటి వ్యత్యాసమే లేదనే చెప్పే ప్రయత్నం చేసారు. హైదరాబాదు రాజధానిగా తెలంగాణ ఏర్పడితే, సీమాంధ్రకు హైదరాబాదుతో లింకు తెగిపోతుందని కమిటీ వాఖ్యానించింది. బెంగుళూరులో పెట్టుబడులు పెట్టడం లేదా? మద్రాసులో వ్యాపారాలు చెయ్యడం లేదా? బెంగుళూరు, మద్రాసులకు తెగని లింకు హైదరాబాదు తో ఎలా తెగుతుందో వారికే తెలియాలి. స్వంత దేశం కాదు, స్వయంగా పాలించుకునే రాష్ట్రం కావలి. తెలంగాణకు అసలు అన్యాయమే జరగలేదంటూ ప్రతీ పేజిలో చెప్పి, చివరికి తెలంగాణ కేటాఇంపులు పరిరక్షించాలంటే ప్రత్యేక కమిటీలు, మండలులు అవసరం అని సిఫార్సు చేసింది. అసలు అన్యాయమే జరుగనప్పుడు ఈ కమిటీల అవసరమేముందో శ్రీకృష్ణ కే తెలియాలి.

ముందున్న దారులంటూ, ఇచ్చిన సూచనలు రిపోర్టులో పేజిల సంఖ్యను పెంచాయే తప్ప కొత్త పరిష్కారం చూపలేక పోయాయి. కొండను తొవ్వి ఎలుకను పట్టినట్టు, పది నేలలు రాష్ట్రమంతా తిరిగి ఆచరణకు నోచుకోని పాత సూచనలే పునరుద్ఘాటిస్తూ చచ్చిన ఎలుకనే పట్టుకున్నారు. ఈ మాత్రందానికే కహానీల కమిటీ అవసరమా? పెద్దమనిషిగా కూర్చోపెడితే, పదేళ్ళ పిలగాడైనా ఇదే పరిష్కారాలు చెప్తాడు. అంత పరిశొదనా ఇంతటి గందరగోల పరిష్కారాలిచ్చింది శ్రీకృష్ణేనా.. అని నమ్మలేక పోతున్నా. లేక లాబీఇస్టుల లంచాలకు లొంగి నిజాలను మంచం కింద దాచి తప్పుడు నివేదిక సమర్పించారా ?? లోగుట్టు యాదగిరి నర్సన్నకెరుక.

మొత్తం నివేదికలో ఉన్న మరెన్నో అంశాలతో విభేదించాలని ఈ బ్లాగు రాయడం మొదలుపెట్టినా.. మచ్చుకైన మెచ్చుకునె విశయం ఒక్కటీ లేని ఈ రిపోర్టు గురించి ఇంకో నిముషమైనా ఆలోచించడం వృధా అని ఇక్కడితో ఆపుతున్నా. చివరిగా.. ప్రత్యేక తెలంగాణ ఊదు కాల్చి, సమైఖ్యాంధ్ర పీరు లేపడానికే తప్ప పనికిరాని ఈ నివేదిక ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి మరింత పట్టుదల అవసరాన్ని మాత్రం తెలియచెప్పింది.

జై తెలంగాణ ! జై జై తెలంగాణ !!

2 comments:

  1. bavundi mitrama ne sight see my blog spot...4r regular telangana updates
    http://thovva.blogspot.com/
    sandeepreddy kothapally

    ReplyDelete
  2. Nice review. Congress and TDP pani out telanganalo.

    ReplyDelete